ప్రవాసీయులకు భరోసా ఏది?
గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి...
ఆదాయంపైనే దృష్టి...
● భారీగా ఆదాయం లభిస్తున్నా...
సంక్షేమంపై దృష్టి సారించని కేంద్రం
● నేడు ప్రవాసీ భారతీయ దినోత్సవం
మోర్తాడ్(బాల్కొండ): ప్రవాస భారతీయుల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నా వారి సంక్షేమంపై చిత్తశుద్ధి చూపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల కోసం కొన్ని సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. గల్ఫ్‌యేతర దేశాల వలస కార్మికుల అంశంపై దృష్టి సారించాల్సి ఉంది. ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుతున్నా వలసదారుల బాగోగుల గురించి ఆలోచించేవారు కరువయ్యారు. అన్ని దేశాల కంటే మన దేశస్తులే విదేశాల నుంచి డబ్బులు పంపించడంలో ముందున్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. భారతీయులు వివిధ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడంతో 2024లో 125 బిలియన్ డాలర్లు అంటే రూ.10.25 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశానికి చేరవేశారు.
● గల్ఫ్ దేశాలకు వీసాల జారీ మొదలుకొని వేతనాలు ఎగ్గొట్టడం ఇతరత్రా మోసాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ మినహా ఇతర దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో మరణిస్తే మాత్రం మృతదేహాల తరలింపు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌పోర్టు నుంచి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి ఇటీవల ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది.
● పార్లమెంట్ సమావేశాల్లో ఇమిగ్రేషన్ యాక్ట్ 1983ను సవరించి కొత్తగా ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇమిగ్రేషన్ యాక్టును సమూలంగా మార్చాలని గడిచిన 15 ఏళ్ల నుంచి వలసదారులు కోరుతూనే ఉన్నారు. ఇటీవల చర్యలు చేపట్టినా ఇంకా తుది దశకు చేరుకోలేదు.
గల్ఫ్ వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తుంది. వలస కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగాలంటే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌యేతర దేశాల వలస కార్మికుల సంక్షేమంపైనా దృష్టి సారించాలి.
– సిస్టర్ లిజీ జోసెఫ్,
ప్రవాస కార్మిక సంఘాల ప్రతినిధి
విదేశాల నుంచి మనవారు పంపిస్తున్న ఆదాయంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కానీ వలస కార్మికులకు మాత్రం ఏమీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను ఇటీవల అమలులోకి తీసుకవచ్చింది. కేంద్రం మాత్రం ఇంకా మౌనం వహిస్తుంది.
–గంగుల మురళీధర్‌రెడ్డి, గల్ఫ్ జేఏసీ ప్రతినిధి
ప్రవాసీయులకు భరోసా ఏది?
ప్రవాసీయులకు భరోసా ఏది?


