జిల్లాస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలు
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ బాలాజీ సత్సంగం 18 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేదారీశ్వర ఆశ్రమంలో విద్యార్థులకు ఇందూర్ జిల్లాస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలను నిర్వహించారు. శ్రీ మద్భగవద్గీత 18వ అద్యాయం మోక్ష సన్యాసయోగముపై నిర్వహించిన శ్లోకాల పోటీలో శారద విద్యానికేతన్ వెల్మల్ పాఠశాల విద్యార్థులు మనస్వీ ప్రథమ, సంవేద్య ద్వితీయ బహుమ తి, ఎండీ అయాన్ ప్రోత్సాహాక బహుమతి సాధించారు. కార్యక్రమంలో బాలాజీ సత్సంగం వ్యవస్థాపకులు కృష్ణకుమార్, ఎండీ మాతాజీ శ్రావ్య, ప్రవళిక, మధుశ్రీ, రమ్యశ్రీ, పూజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: హర్యానా రాష్ట్రంలోని పటోడా సన్క్సరన్ యూనివర్సిటీలో ఈ నెల 9 నుంచి 12 వరకు జరగనున్న 38వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ గురువారం తెలిపారు. బాలికల విభాగంలో సుద్ధపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన బి నిశిత, డి లిఖిత, డి కీర్తన, జి వర్ణిణి, ఆర్మూర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుంచి ఆర్ సౌజన్య ఎంపికయ్యారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో పి నివాస్ (సాంఘిక సంక్షేమ పాఠశాల బోధన్), మురళి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ), ప్రణీత్ కుమార్ (సాంఘిక సంక్షేమ పాఠశాల ఉప్పల్‌వాయి), రేవంత్ (సాంఘిక సంక్షేమ పాఠశాల వేల్పూర్) ఎంపికయ్యారన్నారు. ఇటీవల మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎక్కువమంది క్రీడాకారులు ఎంపిక కావడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా కోచ్ నరేశ్ పాల్గొన్నారు.
వర్ని: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, చందూర్, బాన్సువాడ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శి వినూత్న రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. యూత్ కాంగ్రెస్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హర్షవర్ధన్, సాయి సుమన్, భానుగౌడ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలు


