‘వీబీ జీ రామ్ జీ’తో విప్లవాత్మక మార్పు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్‌గార్ ఔర్ అజీవిక మిషన్(వీబీ జీ రామ్ జీ) నూతన చట్టంతో గ్రామాల అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తెలిపారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గతంలో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద 100 రోజులు మాత్రమే పని కల్పించే వారని, కానీ నూతన చట్టం ద్వారా 125 రోజుల ఉపాధి లభిస్తుందన్నారు. ఈ చట్టంతో గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పను లు, విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పను లు చేపట్టవచ్చని తెలిపారు. ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతోపాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయొచ్చన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్, వీరేందర్, ఓం సింగ్, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, మాస్టర్ శంకర్, ఆమందు విజయ్ కృష్ణ, సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


