స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం
● ఆశ వర్కర్లకు డీఎంహెచ్‌వో రాజశ్రీ హామీ
నిజామాబాద్ రూరల్: ఆశ వర్కర్ల స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజశ్రీ హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పనిచేసే ఆశ వర్కర్లు గురువారం ధర్నా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయానికి చేరుకొని ర్యాలీగా బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోగా, సీఐటీయూ కార్యాలయం వద్దే నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం డీఎంహెచ్‌వో రాజశ్రీకి పోలీసులు తెలపడంతో ఆమె సీఐటీయూ కార్యాలయానికి చేరుకొని ఆశవర్కర్లతో మాట్లాడారు. తన ఆధీనంలో ఉన్న స్థానిక డిమాండ్లను పరిష్కరిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కరానికి ప్రత్యేకంగా సర్క్యులర్‌ను జారీ చేస్తానని హామీ ఇచ్చారు. మిగితా డిమాండ్ల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, వివిధ సర్వేల బకాయి డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని డీఎంహెచ్‌వోకు అందజేశారు.


