తుది జాబితా కోసం కసరత్తు
12న తుది జాబితా..
● రాజకీయ పార్టీల ఫిర్యాదులతో
కదిలిన యంత్రాంగం
● ఇంటింటికి వెళ్లి జాబితాను
సరి చేస్తున్న సిబ్బంది
ఆర్మూర్: జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి బీఎల్‌వోలు ఓటరు జాబితాను సరి చేస్తున్నారు. ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫిర్యాదులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, సిబ్బంది ఓటరు జాబితాలో నుంచి మరణించిన వారి పేర్లను, శాశ్వతంగా దూర ప్రాంతాలకు వలస వెళ్లిన, రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న, నకిలీ ఓటర్లను, గ్రామ పంచాయతీల నుంచి పట్టణ ప్రాంతాలకు బదిలీ చేసుకున్న ఓటర్లను గుర్తించి తొలగించే పనిలో ఉన్నారు. మరో వైపు 2025 అక్టోబర్ 1వ తేదీలోగా నమోదు చేసుకున్న ఓటరుకు మాత్రమే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని పేర్కొంటూ ఆయా పార్టీల ఆరోపణలకు సమాధానాలు చెబుతూ వస్తున్నారు. అధికారులు ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్‌లో 3,44,756 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,65,916, మహిళలు 1,78,797, ఇతరులు 43 మంది ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో మొత్తం 64,165 ఓటర్లు ఉండగా.. పురుషులు 30,735, మహిళలు 33,428 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డుల్లో మొత్తం 69,810 ఓటర్లు ఉండగా.. పురుషులు 33,881, మహిళలు 35,929 మంది ఉన్నారు. భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం ఓటర్లు 14,189 మంది కాగా.. పురుషులు 6,687 మంది, మహిళలు 7,502 మంది ఉన్నారు. మరణించిన వారి పేర్లను, డబుల్ ఓట్లను తొలగించకపోవడంతో ఐదేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికల నాటికి ఇప్పటికీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నకిలీ ఓట్లను గుర్తించే పనిలో భాగంగా బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సవరించిన వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితాలను ఈ నెల 12వ తేదీన ప్రచురించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా ముసాయిదా ప్రచురణతోపాటు టీ–పోల్‌లో ఈ నెల 13న అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. 16వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల్లో తుది ఓటరు జాబిత, పోలింగ్ స్టేషన్‌ల జాబితాను ప్రచురించాలని ఆదేశించారు.


