చర్యలు తప్పవు
కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
● డ్యూటీ డాక్టర్ అందుబాటులో
లేకపోవడంపై ఆగ్రహం
విధుల్లో
నిర్లక్ష్యం వహిస్తే
ఆర్మూర్ : వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రిసెప్షన్ సెంటర్లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరును వాకబు చేశారు. ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్థానికంగా నెలకు సగటున ఎన్ని సాధారణ ప్రసవాలు చేస్తున్నారు, సిజేరియన్లు ఇక్కడే అవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఉన్నారు.


