పోడు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
● ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి
● రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
గాంధారి : పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రెండు మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. పోడు భూముల సమస్యలను తెలుసుకునేందుకు గాంధారిలోని మారుతి ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోడు, గిరిజన రైతులతో సమావేశం నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై వారికే హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేశారన్నారు. 2005 వరకు అటవీ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఇచ్చారని గుర్తు చేశారు. పోడు రైతులు తమ సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని రైతు కమిషన్ సభ్యుడు రాములు నాయక్ సూచించారు.
ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ద్వారా ఇచ్చిన పాసుబుక్కులు ఉన్నా అటవీ అధికారులు సాగు చేయనివ్వడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. ఒకవేళ సాగు చేసినా పంటలను ధ్వంసం చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. సభ్యులు గడుగు గంగాధర్, రాములు నాయక్, గోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.


