సంక్షిప్తం
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బుధవారం బైపాస్ రోడ్డు సిగ్నల్ చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతలపై రూరల్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కూలిరేట్లను పెంచాలని వినతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని మాదాపూర్‌లో ఉన్న బేవరేజీ డిపో హమాలీ కార్మికులకు కూలిరేట్లను పెంచాలని బుధవారం సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు బుధవారం కార్మికులతో కలిసి జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రెండేళ్లకోసారి లోడింగ్, కూలి రేట్లను పెంచడానికి గతంలోనే అంగీకారం జరిగిందని కానీ గత డిసెంబర్ 1 నుంచి పెంపుదలలో వైన్స్ యజమానులు కొద్దిమంది అమలు జరపకుండా ఇబ్బందులు పెడుతున్నారని వెంటనే రేట్లను పెంచాలని కోరారు. నాయకులు శ్రీనివాస్, రమేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఈవోను తొలగించాలని వినతి
ఖలీల్‌వాడి: ఎడపల్లి ఎంఈవోను తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు బుధవారం డీఈవో అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని ఓ టీచర్ పై ఎంఈవో కేసు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నారు. గతంలో కూడా ఎంఈవో టీచర్లను ఇబ్బందులకు చేశారని వారు ఆరోపించారు. నాయకులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్, స్వామి నాయక్, జమినుల్లా, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
దంత వైద్య శిబిరం
నిజామాబాద్ రూరల్: రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్, శీను నాయక్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మల్లారం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు దంత వైద్యశిబిరం నిర్వహించారు. పాఠశాలలోని 350 విద్యార్థులను పరీక్షించి, దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మందులు, టూత్ పేస్టులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమేశ్, రంజిత్ సింగ్, గిరీశ్ కుమార్, పడాల సత్తయ్య, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్‌వోసీ అందజేత
సిరికొండ: మండలంలోని చీమన్‌పల్లి గ్రామానికి చెందిన రేణవ్వకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూ. ఐదు లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. ఎల్‌వోసీని బాధితురాలి కుమారుడు నరేశ్‌కు ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ కళ్లెం నర్సయ్య, ఉపసర్పంచ్ ఏనుగు రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నేటి నుంచి గొర్రెలకు టీకాలు
మోపాల్: మండలంలోని 21 గ్రామాల్లో ఈనెల 8 నుంచి 22 వరకు గొర్రెలు, మేకల్లో ఉచిత పోచమ్మ నివారణా టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి శిరీష బుధవారం తెలిపారు. 8న కాల్పోల్, 9న చిన్నాపూర్, 10న బైరాపూర్, 12న బాడ్సి, 13న నర్సింగ్‌పల్లి, 16న మంచిప్ప, 17న కంజర్, 19న కులాస్‌పూర్, కులాస్‌పూర్ తండా, 20న మోపాల్, సిర్‌పూర్, 21న న్యాల్‌కల్, 22న ముదక్‌పల్లి, ఎల్లమ్మకుంటలో టీకాలు వేస్తామన్నారు. మండలంలోని అన్ని గ్రామాల గొర్రెలు, మేకల పెంపకందారులు, యాదవ సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంక్షిప్తం
సంక్షిప్తం


