ఆశల పోరుబాట
● ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి
● జిల్లా కేంద్రంలో ఆశావర్కర్ల భారీ ర్యాలీ
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించే ఆశా కార్యకర్తలు ఆందోళన పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ప్రధాన డిమాండ్ అయిన రూ. 18 వేల వేతనాన్ని ఇస్తామని చెప్పి ముఖం చాటేసింది. దీంతో జిల్లాలో ఆశావర్కర్లు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి వందలాది మంది ఆశావర్కర్లు పాత కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఆశలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి ఆశలకు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఆశలకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18వేలు అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశలకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదని వాటిని వెంటనే ఇవ్వాలన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లెప్రసి సర్వే చేయా లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఆశలను ఆదేశిస్తున్నారని ఆ సర్వేకు అదనంగా ఎంత డబ్బులు చెల్లిస్తారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. పలు జిల్లాల్లో వీటికి డబ్బులు ఇవ్వమని అధికారులు చెబుతున్నారని ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆశవర్కర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. నాయకులు సుకన్య, బాలమణి, రమ, నర్సా, ఇందిరా, రేఖ, రేణుక, శాంతి, బాలమణి , విజయ, లావణ్య పాల్గొన్నారు.


