మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
డిచ్‌పల్లి: జిల్లా కేంద్రానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి సీఎంసీ మైదానంలో డిచ్‌పల్లి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ క్రికెట్ పోటీలను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బొద్దుల డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలను విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక దృడత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిచ్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, ఏడో పోలీస్ బెటాలియన్ కు చెందిన 16 జట్లు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గాదె కృష్ణ, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్ బీ వినోద్, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాదాస్, ప్రముఖ వైద్యులు దీపక్ రాథోడ్, జమాల్‌పూర్ రాజశేఖర్, ఆర్ అండ్ బీ విశ్రాంత ఈఈ శ్రీమన్నారాయణ, నడిపల్లి తండా సర్పంచ్ పవార్ శాంతిలాల్, ఉప సర్పంచ్ గణేశ్, టోర్నీ నిర్వాహకులు జే నరేశ్, సాజిద్, మెరుగు నాగరాజు, మధుసూదన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


