బ్రెయిలీ లిపి కాదు.. అంధుల ఆశాజ్యోతి
● సీపీ సాయి చైతన్య
● స్నేహ సొసైటీలో ఘనంగా బ్రెయిలీ 217వ జయంతి
సుభాష్‌నగర్: లూయి బ్రెయిలీ ఒక లిపి కాదని.. అంధుల ఆశాజ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అంధుల వనరుల కేంద్రం ఆవరణలో అంధుల జీవనజ్యోతి, అక్షర ప్రదాత, బ్రెయిలీ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సీపీతోపాటు డీఎంహెచ్‌వో రాజ శ్రీ, డీడబ్ల్యూవో రసూల్ బీ ముఖ్యఅతిథులుగా హాజరై లూయి బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఆత్మ విశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగితేనే ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్ధయ్య, ఉపాధ్యాయులు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని చెప్పా రు. అంధ విద్యార్థిని రజిని స్నేహా సొసైటీ పాఠశాలకు 50 వేల విలువైన బెంచీలను విరాళంగా అందజేశారు. మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సీడీపీవో సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న, సాగర్, ఆరోగ్య రాజు, ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు.


