
సిజేరియన్‌లు తగ్గించాలి
● నిబంధనలను పాటించని
స్కానింగ్ సెంటర్లను మూసేస్తాం
● వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం : ప్రైవేట్ ఆస్పత్రులో సిజేరియన్‌లు తగ్గించాలని, ప్రతి ఆస్పత్రికి బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. గురువారం సిజేరియన్ శస్త్ర చికిత్సలపై ఆడిట్ టీం సభ్యులు, సంబంధిత అధికారులతో తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులన్నీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో గర్భిణులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిల్పించాలని, ముఖ్యంగా కూర్చోడానికి కుర్చీలు, తాగునీటి, టాయిలెట్ వసతులు, అదేవిధంగా వాహనాల కోసం పార్కింగ్ స్థలాన్ని, ఫైర్ ప్రమాద నివారణ వసతి కలిగి ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, టారిఫ్ చార్జీల చార్ట్‌ను వెయిటింగ్ హాలులో ప్రదర్శించాలన్నారు. అనవసర సిజేరియన్ శస్త్ర చికిత్సలను నివారించాలని, ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు పర్సంటేజీల ఆశ చూపుతూ అనవసర సిజేరియన్ శస్త్ర చికిత్సలను చేయరాదన్నారు. ప్రతి ఆస్పత్రిని మూడు నెలలకు ఒకసారి వెరిఫై చేయాలన్నారు. ప్రతినెల 300 ఆస్పత్రులను ఎంక్వయిరీ చేయాలని అన్నారు. అనవసర అబార్షన్లు కూడా చేయరాదన్నారు. జిల్లాలో 176 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటర్లో అర్హులైన రేడియాలజిస్ట్ ద్వారానే స్కానింగ్ నిర్వహించాలన్నారు. వైద్యులు కాని వారి ద్వారా వచ్చిన రిఫరల్ స్లిప్పులతో స్కానింగ్ చేయరాదన్నారు. అందుకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్ సెంటర్లను మూసి వేస్తామని హెచ్చరించారు. సమీక్షలో ఆర్మూర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్వేత, డాక్టర్ సుప్రియ, డాక్టర్ అశ్విని వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.