
ఏకగ్రీవ పంచాయతీలకు మొండిచేయి
● పదవీ కాలం పూర్తయినా
దక్కని నజరానా
● నిధుల విడుదలను
పట్టించుకోని గత ప్రభుత్వం
మోపాల్: గ్రామాభివృద్ధిని కాంక్షించి పంచాయతీలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు మొండిచేయే దక్కింది. ఎన్నికలు లేకుండా ఆదర్శంగా నిలిచిన జీపీలు పాలకుల వ్యవహారంతో అన్యాయానికి గురయ్యాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తయినా ఆదర్శ గ్రామపంచాయతీలకు నజరానా నేటికి అందలేదు. రూ.10 లక్షలను ప్రభుత్వం, మరో రూ.15లక్షలు ఎమ్మెల్యే, ఎంపీల నిధుల నుంచి కేటాయిస్తామని ప్రకటించారు. ఆ నిధులు విడుదలైతే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనుకున్న వీరి ఆశలు అడియాశలయ్యాయి. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 530 (ప్రస్తుతం 542 జీపీలు) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల్లో 130 జీపీల్లో సర్పంచ్, వార్డుసభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరగకుండా సర్పంచ్ సహా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తమ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు కేటాయిస్తామని ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటినా.. మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నా.. ప్రోత్సాహకం కింద ఇస్తామన్న డబ్బులు రాకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలంటే ఆషామాషీ కాదు
పంచాయతీ ఎన్నికల వేళ ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వారు రాజకీయ శత్రువులుగా, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉన్న వారు దోస్త్ మేరా దోస్త్ అనేలా సమీకరణాలు మారిపోతుంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ గెలవడం కన్నా.. సర్పంచ్ కావడం ఎంతో కష్టమని సీనియర్ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ సందర్భంలో ప్రస్తావించారు. ఇంతటి సందడి ఉండే ఎన్నికలను ఏకగ్రీవం పేరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు తగిన ప్రోత్సాహం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ మొత్తాన్ని రూ.50వేల నుంచి రూ.5లక్షలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి మరో రూ.15లక్షలు అదనంగా కేటాయిస్తామని తెలిపింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నజరానాను పెంచుతుందో లేదో వేచి చూడాలి.
మోపాల్ మండలంలోని తాడెం జీపీ కార్యాలయం
ప్రభుత్వాలపై సన్నగిల్లుతున్న విశ్వాసం..!
ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామపంచాయతీలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకం ప్రకటిస్తున్నా.. నిధుల విడుదల్లో చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకమనేది చాలా ప్రభావితం చేస్తోంది. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పక తప్పదు. కాగా ఇదేవిషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ వివరణ కోరగా, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం కోసం పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు.