
స.హ. చట్టానికి విలువేది?
● సమాచారం ఇవ్వడంలో
అధికారుల కప్పదాటు వైఖరి
● నేడు సమాచార హక్కు చట్టం దినం
సిరికొండ: ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే ప్రజలకు గొప్పవరం సమాచార హక్కు చట్టం. అమలులో లోపాల వల్ల క్రమక్రమంగా నీరుగారి పోతోంది. సమాచారం ఇవ్వడంలో అధికారులు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. 12అక్టోబర్2005న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 5 నుంచి ఆర్‌టీఐ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 ప్రకారం పౌర సమాజం ద్వారా వచ్చిన సహ దరఖాస్తులను ప్రజా సమాచారం అధికారులు (పీఐవో) పట్టించుకోవడం లేదు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో ఇవ్వాల్సిన సమాచారాన్ని నెలలు గడిచినా ఇవ్వడం లేదు. సహచట్టం దరఖాస్తుదారులు సమాచారం కోరితే కొందరు అధికారులు సహయ నిరాకరణ చేస్తుండగా, మరికొందరు అరకొర సమాచారం ఇస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన 4(1)బి సెక్షన్‌కు చెందిన 17 అంశాల సమాచారం ప్రదర్శించడం లేదు. ఈ నెల 8న నిర్వహించిన సహచట్టం జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా శాఖ అధికారులకు, ప్రజా సమాచార అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్నారు. డివిజన్, మండల కేంద్రాల్లోని ప్రజా సమాచార అధికారులు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచవద్దని కోరారు. 306 అప్పీళ్లు, 127 ఫిర్యాదులు పెండింగ్
సమాచార కమిషన్‌లో ప్రస్తుతం జిల్లా నుంచి 306 అప్పీళ్లు, 127 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాల వారీగా సమాచార కమిషన్ అప్పీళ్లు ఫిర్యాదులపై సమీక్ష జరుపుతోంది. అక్టోబర్ చివరి వారంలో సమాచార కమిషనర్లు జిల్లాకు రానున్నారు.