
చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం చెట్టుపై నుంచి పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ శనివారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీకి చెందిన ప్రేమ్ ఇద్దరు వ్యక్తులతో కలిసి రాంనగర్ కాలనీలోని రామకృష్ణ ఇంటికి చెట్టు కొమ్మలు కొట్టడానికి వచ్చారు. కాగా ప్రేమ్‌తో వచ్చిన ఇద్దరు అడ్డా కూలీల్లో ఒకతను చెట్టు కొమ్మలు కొడుతూ ప్రమాదవశాత్తు కిందపడి పోయాడు. తలకు తీవ్ర గాయాలు కాగా ఇంటి యజమాని క్షతగాత్రుడిని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
బాల్కొండ: మెండోరా మండల శివారులోని కాకతీయ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైనట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. మృతురాలి వయస్సు 55–60 ఏళ్ల వరకు ఉంటుందని, లేత ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. ఎడమ చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712659859, 8712659864 నంబర్ల సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
కుటుంబ తగాదాలతో యువకుడి ఆత్మహత్య
మోపాల్: కుటుంబ తగాదాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని సిర్‌పూర్ గ్రామానికి చెందిన గోదా సందీప్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపంతో క్షణికావేశానికి గురైన సందీప్ శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో డిష్ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పేకాట స్థావరంపై దాడి
డొంకేశ్వర్: మండలంలోని మారంపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. ఊరి బయట రేకుల షెడ్డులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకోగా వారి నుంచి రూ.5,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి