
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నవీపేట: మండల కేంద్రంలోని బాసర రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ హెచ్చరించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని బాసర క్షేత్రానికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను శనివారం పరిశీలించారు. కొన్ని ఆక్రమణలను తొలగించి, మరికొందరికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం స్థానిక పీఎస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇరుకుగా ఉన్న బాసర రహదారికి ఇరువైపులా కొందరు వ్యాపారులు స్థలాన్ని ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు, ఇష్టానుసారంగా పార్కింగ్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బాసరలోని సరస్వతిదేవి దర్శనానికి వెళ్లే భక్తులకు నవీపేటలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే వారాంతపు కూరగాయలు, మేకల సంత ఇదే ప్రాంతంలో జరగడంతో మరింత ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.