
ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత
ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఇలా..
● గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల!
● ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో 862 టీఎంసీలు.. అవుట్ ఫ్లో 700 టీఎంసీలు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలోకి నీటి విడుదలను అధికారులు శనివారం నిలిపివేశారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 700టీఎంసీల నీటిని వదిలారు. అందులో వరద గేట్ల ద్వారా 680 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 20 టీఎంసీలు విడుదల చేశారు. ఆగస్టు 27 నుంచి మధ్యలో మూడు రోజులు మినహాయించి నిరంతరం వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి 862 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కాగా, ఈ నెల 28 వరకు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉంది.
కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల..
ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 3 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
వరద గేట్ల ద్వారా 680 టీఎంసీలు
వరద కాలువ ద్వారా 50.54 టీఎంసీలు
కాకతీయ కాలువ ద్వారా 26 టీఎంసీలు
సరస్వతి కాలువ ద్వారా 3.12 టీఎంసీలు
లక్ష్మి కాలువ ద్వారా 0.54 టీఎంసీలు
ఎస్కేప్ గేట్ల ద్వారా 20 టీఎంసీలు
ఆవిరి రూపంలో 5.54 టీఎంసీలు
అలీసాగర్ లిప్టు ద్వారా 0.58 టీఎంసీలు
గుత్ప లిప్టు ద్వారా 0.29 టీఎంసీలు
మిషన్ భగీరథకు 2.57 టీఎంసీలు