
బీరు సీసాతో ఆర్టీసీ బస్సుపై దాడి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఓ యువకుడు మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుపై బీరు సీసాతో దాడి చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు ఆలూర్ మీదుగా నందిపేట్ వెళ్తుండగా ఆలూర్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జాన్(ప్రవీణ్) అనే యువకుడు బైక్‌ను ఇష్టానుసారంగా నడుపుతుండడంతో డ్రైవర్ శ్రీరాములు హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ జాన్ బీరు సీసాతో బస్సుపై దాడి చేశాడు. అనంతరం బస్సులోకి ప్రవేశించి మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. బీరు సీసాతో బస్సు డ్రైవర్‌ను చంపాలని ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అదే సమయంలో వార్త సేకరణకు వెళ్లిన ఓ రిపోర్టర్‌ను సైతం జాన్ బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే జాన్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి జాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు డ్రైవర్, రిపోర్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.