
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
బోధన్‌టౌన్(బోధన్): ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే సహించేది లేదని, ఆర్‌ఎంపీ, పీఎంపీలు రిఫర్ చేసిన రోగులకు స్కానింగ్ తీయొద్దని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాలో బోధన్ డివిజన్ స్థాయిలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల వివరాలు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందించాలన్నారు. డాక్టర్ మారినా, ఒకే డాక్టర్ ఒకటి లేదా రెండు ఆస్పత్రుల్లో పనిచేస్తే ఆ వివరాలు సూచిక బోర్డులో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆస్పత్రుల్లో బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, పొల్యూషన్, పార్కింగ్, లీజ్, రెంట్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలో ధరల సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని, చికిత్స కోసం వచ్చే రోగులకు ఆస్పత్రిలో ప్రాథమిక వసతులు తప్పనిసరి కల్పించాలన్నారు. సమావేశంలో సూపర్‌వైజర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.