
ముంబోజీపేటలో ఒకరి అదృశ్యం
లింగంపేట: మండలంలోని ముంబోజీపేట గ్రామానికి చెందిన పస్కూరి కాశీరాం అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై వెంకట్రావు మంగళవారం తెలిపారు. మూడు రోజుల క్రితం భార్య రాణితో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
ఖలీల్‌వాడి: అనారోగ్యంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వినాయక్‌నగర్‌కు చెందిన దోమల చంద్రకళ(55) ఆరు నెలలుగా అనారోగ్యంతో పాటు మానసికంగా బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ధర్మాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ల్యాప్‌టాప్ అప్పగింత
రాజంపేట: పోగొట్టుకున్న ల్యాప్‌టాప్‌ను రికవరి చేసి బాధితుడికి అందించినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన వెంకోళ్ల యాదగిరి 15 రోజుల క్రితం తన ల్యాప్‌టాప్‌ను పోగొట్టుకున్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత వ్యక్తిని విచారించారు. డేటాబేస్ ఆధారంగా ల్యాప్‌టాప్‌ను పట్టుకుని బాధితుడికి అందించినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు చిరంజీవి, చరణ్ ఉన్నారు.
పాతకక్షలతో ఒకరిపై దాడి
ఖలీల్‌వాడి: పాతకక్షల నేపథ్యంలో ఒకరిపై దాడి జరిగిన ఘటన నగరంలోని మైఫిల్ హోటల్ వద్ద జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్‌కు చెందిన సాయికుమార్, సాయినాథ్‌లకు గతంలో పాత కక్షలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి సాయికుమార్ తన స్నేహితుడైన శివ బర్త్‌డే వేడుకల్లో పాల్గొని మంగళవారం ఉదయం 3 గంటలకు మైఫిల్ హోటల్ వద్దకు వచ్చారు. కాగా అక్కడే ఉన్న సాయినాథ్ వీరిని పలుకరించాడు. సాయికుమార్‌ను పక్కకు రావాలంటు సాయినాథ్ కోరడంతో అతను వెళ్లాడు. తనపై గణేశ్ ఉత్సవాల్లో ఎందుకు పోలీస్ కేసు పెట్టావంటు జేబులో ఉన్న బ్లేడ్‌తో సాయికుమార్ గొంతుపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నందిపేట్‌లో యువకుల ఘర్షణ
నందిపేట్: మండల కేంద్రంలోని బస్‌డిపో స్థలంలో గుర్తు తెలియని యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కొండూర్ రమేశ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి మద్యం తాగేందుకు స్థానిక బస్ డిపో స్థలానికి వచ్చాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య రమేశ్‌కు గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో రమేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో అచేతన స్థితికి చేరాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకు వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముంబోజీపేటలో ఒకరి అదృశ్యం

ముంబోజీపేటలో ఒకరి అదృశ్యం