
బాడ్సిలో రేకుల షెడ్డుకు నిప్పు
మోపాల్: మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు నల్ల శశాంక్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రేకుల షెడ్డుకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం శశాంక్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పరికరాల కోసం షెడ్డును నిర్మించుకున్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న గ్రామస్తులు షెడ్డుకు నిప్పంటుకున్న విషయాన్ని శశాంక్‌కు ఫోన్ ద్వారా చెప్పడంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే షెడ్డులో ఉన్న పైపులు, ట్రాక్టర్ టైరు, ఇతరత్ర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అక్కడే ఏర్పాటు చేసిన తన తండ్రి నల్ల చిన్న సాయిరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సీఐ సురేశ్, ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శశాంక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. రూ.20వేల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు.
గాంధీనగర్‌లో దొంగల బీభత్సం
నవీపేట: మండలంలోని గాంధీనగర్‌లో ముసుగులు ధరించిన దొంగల ముఠా సోమవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. గుర్తు తెలియని 8 మంది గ్రామంలోకి చొరబడి అన్ని ఇళ్ల తాళాలను పగులగొట్టేందుకు యత్నించారు. సుదర్శన్‌కు చెందిన కిరాణ దుకాణం షట్టర్‌ను తొలగించి లోపలకు ప్రవేశించారు. చప్పుడు రావడంతో మేల్కొన్న గ్రామస్తుల అలజడికి దొంగలు పారిపోయారు. ఈ దృశ్యాలు గ్రామంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దొంగలను పట్టుకుంటామని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తెలిపారు.