ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన బాట
మోర్తాడ్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసనబాట చేపట్టారు. మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై నిరసన తెలుపుతూ బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి మండలాల వారిగా అధికార యంత్రాంగానికి వినతిపత్రాలు అందించారు. దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలోని 530(పునర్విభజన చేయడానికి ముందు ఉన్న) గ్రామ పంచాయతీలకు గాను 275 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గడిచిన జనవరి నెల నుంచి వేతనాలు అందక పోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు ఇతరత్రా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు చూపడంతో పాటు హరితహారం, నర్సరీల నిర్వహణ ఇతరత్రా పనులు చేస్తున్నా తమ శ్రమకు గుర్తింపు లేదని వారు వాపోయారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
ఇబ్బందుల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
ప్రభుత్వం స్పందించాలి
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. ఎన్నో ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కూలీలకు, ప్రభుత్వ యంత్రాంగానికి వారధిగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లను నెరవేర్చాలి. – రామరాజు, ఫీల్డ్ అసిస్టెంట్, తొర్తి


