చెత్తకు నిప్పు.. చెట్లకు ముప్పు
వేల్పూర్: మండలంలోని అమీనాపూర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్ట డంతో సమీపంలోని హరితహారం చెట్లు దెబ్బ తింటున్నాయి. దీంతో అవి మొదళ్ల వద్ద కాలి బలహీనమై బలమైన గాలులు వీస్తే విరిగిపోయే స్థితికి చేరుకున్నాయి. వేల్పూర్ నుంచి 63వ నంబర్ జాతీయ రహదారి వరకు దివంగత వేముల సురేందర్‌రెడ్డి యాభై ఏళ్ల క్రితం మొక్కలు నాటించగా వృక్షాలుగా మారాయి. వీటికి తోడు 2016లో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మోతె గ్రామానికి వచ్చినప్పుడు మోతె నుంచి వేల్పూర్ మీదుగా 63 నంబరు జాతీయ రహదారి వరకు వేలాది మొక్కలు నాటారు. వాటిని పదేళ్ల పాటు హరితహారం కార్యక్రమం ద్వారా నీరుపోసి సంరక్షించగా భారీ చెట్లుగా రూపుదిద్దుకున్నాయి. రహదారికి ఇరువైపులా పంటలకు నీడ వచ్చి దిగుబడి రాకుండా చేస్తున్నాయని కొందరు నరికి వేస్తుండగా, మరికొన్ని చోట్ల వృక్షాల మొదళ్ల వద్ద చెత్తను తగులబెడుతున్నారు.
దీంతో చెట్ల మొదళ్లు కాలిపోయి బలం కోల్పోతున్నాయి. అధికారులు స్పందించి చెట్లకు నిప్పు పెట్టకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


