అంబేడ్కర్‌ను అవమానిస్తే తిప్పికొడతాం
నిజామాబాద్ సిటీ: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించినా తిప్పికొడతామని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకులు అంబేడ్కర్‌ను అవమానించారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి పేరిట బీజేపీ నాయకులు తాకడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌పై పార్లమెంటులో హోంమంత్రి అవమానకరంగా మాట్లాడినా ప్రధాని మోదీ ఖండించలేదన్నారు. అమిత్‌షాపై చర్యలు తీసుకోలేదంటేనే బీజేపీ అంబేడ్కర్‌పై చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హత్య చేసిన వారే సానుభూతి తెలిపినట్టు బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహాల శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారని ఎద్దేవా చేశారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామగ్రామానా తీసుకెళ్లి అంబేడ్కర్ ఆశయాలను వివరిస్తామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ప్రపంచమంతా అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తే దేశ ప్రధాని మాత్రం పార్లమెంటులో నివాళులర్పించలేదన్నారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు రత్నాకర్, రేవతి, విపుల్ గౌడ్, వేణురాజ్, లింగం, నరేందర్, విజయ్ పాల్ రెడ్డి, కోనేరు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం


