దిలావర్‌పూర్/సారంగపూర్: మండల కేంద్రాల్లోని మొక్కజొన్న, జొన్న, వరి కల్లాలను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అన్నదాతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులను నిలదీశారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కజొన్న పంట పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కాక రైతులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు వరి ధాన్యం కల్లాలకు వస్తుందని, అకాల వర్షాల భయం రైతుల ను వెంటాడుతోందని తెలిపారు. రైతులకు గోనె సంచులు అందుబాటులో ఉంచి, రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, నాయకులు మంద మల్లేశ్, వీరేష్, శైలేశ్వర్, విక్రమ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


