తోడుకున్నోళ్లకు తోడుకున్నంత! | - | Sakshi
Sakshi News home page

తోడుకున్నోళ్లకు తోడుకున్నంత!

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

● ఎస్సారెస్పీలో యథేచ్చగా మట్టి తవ్వకాలు.. ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● భారీ టిప్పర్లతో ధ్వంసమవుతున్న రోడ్లు ● చోద్యం చూస్తున్న అధికారులు

లోకేశ్వరం: జిల్లాలోని దిలావర్‌పూర్‌, సముందర్‌పల్లి, లోకేశ్వరం మండలాల్లోని మొహళ్‌, గొడిసెరా, పంచగుడి ప్రాంతాల్లో ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ తగ్గిపోయింది. దీంతో నల్లమట్టి అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. భారీ జేసీబీలతో మట్టిని తవ్వి, టిప్పర్లలో తరలించుకుపోతున్నారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం రాకుండా అధికారులు, ఆధికార పార్టీ నాయకుల మద్దతుతో ఈ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

రైతుల అవసరాన్ని లాభంగా..

వేసవి కాలంలో నేల చదును చేసుకునేందుకు రైతులు ఎస్సారెస్పీ నల్లమట్టిని ఆశ్రయిస్తారు. ఇది రసాయన ఎరువులను తగ్గించి, భూసారాన్ని పెంచుతుంది. అయితే, వ్యాపారులు ఈ అవసరాన్ని దుర్వినియోగం చేసి, పంచగుడి గోదావరి వంతెన నుంచి నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రక్కులో 40 టన్నులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తూ ఫామ్‌హౌస్‌లకు సరఫరా చేస్తున్నారు.

రోడ్ల ధ్వంసం..

భారీ టిప్పర్ల రద్దీతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పక్షం రోజులుగా అక్రమ తరలింపు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇది అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా ప్రజాధనంతో వేసిన రోడ్లు దెబ్బతింటున్నా అధికారులో పట్టించుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అతివేగంగా వాహనాలు

ప్రతీరోజు భారీ టిప్పర్లు ఓవర్‌ లోడుతో పదుల సంఖ్యలో తిరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. ప్రమాదాలు జరిగే అవకశాలు ఉన్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

– చిన్నారెడ్డి, ధర్మోర

అధికారులు చర్యలు తీసుకోవాలి

మట్టి తరలింపును ఎస్సారెస్పీ అధికారులుగానీ మైనింగ్‌శాఖ వారు గానీ పట్టించుకోవడం లేదు. మా పరిధిలకి రాదు. మండలంలోని గోదావరి నది శివారులో నల్ల మట్టి తరలించేందుకు రెవెన్యూ శాఖ తరఫున ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.

– సూర్యరావు, లోకేశ్వరం తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement