నిర్మల్‌చైన్‌గేట్:మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ధాన్యం గోదాములకు తరలింపు ప్రక్రియపై బుధవారం సమీక్ష నిర్వహించారు. టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్ద ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం తరలింపునకు వినియోగించాలన్నారు. అవసరానికి అనుగుణంగా మరిన్ని లారీలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. లారీలు సమకూర్చే ప్రాంతాలు, అన్‌లోడింగ్ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉండకూడదని పేర్కొన్నారు. అవసరమైతే స్థానిక కూలీలను హమాలీలుగా నియమించుకోవాలని 25 నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో అన్‌లోడింగ్ పాయింట్లు ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేపట్టాలన్నారు. ప్రభుత్వ గోదాములతోపాటు ప్రైవేట్ గోదాములు, రైతు వేదికలు తదితర ప్రాంతాల్లో కూడా ధాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వరి, మొక్కజొన్న ధాన్యం తరలింపు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేందుకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాలు, ఇతర తనిఖీ కేంద్రాల్లో తగిన పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఎస్పీ శ్రీని వాస్, డీఎస్‌వో, మేనేజర్లు రాజేందర్, సుధాకర్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఏవో అంజిప్రసాద్ పాల్గొన్నారు.
అన్‌లోడింగ్‌లో జాప్యం వద్దు...
లోకేశ్వరం: మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను, రాయపూర్ కాండ్లిలోని రెస్ మిల్లులను కలెక్టర్ భవేశ్‌మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. లారీలను 24 గంటల్లో అన్‌లోడ్ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు చేయొద్దని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


