ఖానాపూర్: రాష్ట్రప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఖానాపూర్ కేంద్రంగా త్వరలో తెలంగాణ మోడల్ స్కూల్, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని జీవీఆర్ కన్వెన్షన్ హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపడుతోందన్నారు. సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు విద్యారంగ అభివృద్ధిపై అవగాహన కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఖానాపూర్‌లో పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అవగాహన కార్యక్రమానికి హాజరైన సర్పంచులకు గ్రామాభివృద్ధి కోసం అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేసే విషయమై కలెక్టర్‌తో మాట్లాడనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, ఎంఈవో సంధ్యారాణి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


