భైంసాటౌన్: భైంసాలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనకు ఎట్టకేలకు తెర పడింది. ఈనెల 12న నిర్వహించాలని ఎన్నిక హఠాత్తుగా, నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారంటూ కమిషనర్ తీరును నిరసిస్తూ అధికార పక్ష సభ్యులు రెండురోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. బుధవారం సైతం ఆందోళన కొనసాగించగా, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ లింగయ్య, టీపీవో అనురాధ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, గేటు వద్దే అడ్డుకున్నారు. ఎంఐఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కమిషనర్ ఎన్నిక నిర్వహణలో మూడురోజులుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వాయిదాకు కారణం చెప్పాలని నిలదీశారు. ఎన్నిక వాయిదాలో తన తప్పేమి లేదని కమిషనర్ వారికి బదులిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి కమిషనర్‌ను కోరగా, అందుకు తనకు అధికారం లేదన్నారు. దీంతో కమిషనర్ తీరుపై పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ చాంబర్‌లో కమిషనర్, కౌన్సిలర్ల మధ్య చర్చలు జరిగాయి. కమిషనర్ వివరణకు సంతృప్తి చెందకపోవడంతో, పంచాయితీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లింది. కమిషనర్, కౌన్సిలర్లు ఎమ్మెల్యే రామారావుపటేల్ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ఆందోళన విరమిస్తున్నట్లు చైర్మన్ తూమోల్ల దత్తాత్రి తెలిపారు.


