జనగణనలో భాగస్వాములవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో భాగస్వాములవ్వాలి

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

నిర్మల్‌టౌన్‌: జనగణన ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జనగణన ప్రచార వాహనాన్ని సోమవారం జెండాఊపి ప్రారంభించారు. ప్రచార వాహనం ద్వారా జిల్లాలో ప్రజలకు జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారంతో సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ముగిసిందని, జిల్లాలో సుమారు 20 వేల మంది స్వయంగా వివరాలు ఆన్‌లైన్‌లో నమో దు చేశారని వివరించారు. ప్రజలంతా అధికారులకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. వివరాలన్నీ పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

గణన గడువులోగా పూర్తిచేయాలి..

నిర్మల్‌రూరల్‌: జన గణన ప్రక్రియలో భాగమైన హౌస్‌ లిస్టింగ్‌ నిర్ణీత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ మండలం తల్వేద గ్రామంలో హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియ తీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియలో ఇళ్ల గణన అత్యంత కీలకమన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నంబర్లను కేటాయించాలని పేర్కొన్నారు. ఎండలు అధికంగా ఉన్నాయని, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హౌస్‌ లిస్టింగ్‌ చేపట్టాలన్నారు. సీపీవో జీవరత్నం, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ లక్ష్మి పాల్గొన్నారు.

ఓటరు మ్యాపింగ్‌ పూర్తి చేయాలి

నిర్మల్‌టౌన్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మ్యాపింగ్‌ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. మ్యాపింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement