కైలాస్‌నగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15న ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంఽధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ పీవో సహకారంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేళాలో టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనా న్స్, స్టార్టెక్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఫార్మసీ విభాగాల్లో వందలాది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి గలవారు 15న ఉదయం 10 గంటలకు విద్యార్హత ధ్రు వీకరణ పత్రాలతో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9989717139, 9494559027, 9553141962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


