ఆదివాసీ పల్లెలు మారేనా! | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ పల్లెలు మారేనా!

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

త్వరలో హీరాపూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులు, వడగామ్‌ ప్రాజెక్టుపై ఆశలు ఇప్పటికే అధికారుల సర్వే రైతులు, జనాభా వివరాల సేకరణ

ఇంద్రవెల్లి: ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆదివాసీ పల్లెల గతి మారనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మౌలిక వసతులు, రవాణా, విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ ఆదివాసీల సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈనెల 20 తర్వాత పర్యటించనున్నారు. ఆయన రాకతో హీరాపూర్‌ జీపీ పరిధిలోని ఏడు గ్రామాల అభివృద్ధి రూపురేఖలు మారుతాయని, వడగామ్‌ ప్రాజెక్టు మంజూరు చేస్తారని ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, చే లల్లో సోలార్‌ పంపు సెట్లు, గ్రామాలకు రోడ్లు, హీరపూర్‌లో ఆరోగ్య సబ్‌ సెంటర్‌, పశు వైద్యశాఖ మంజూరవుతాయని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శాఖలవారీగా అధికారులు సర్వే చేపట్టారు. రైతులు, కుటుంబాలు, జనాభా, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రితో ప్రారంభించనున్నారు.

వడగామ్‌ ప్రాజెక్టుపై గంపెడాశలు

వడగామ్‌ ప్రాజెక్టు మంజూరుపై ఆదివాసీలు, ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. 2005లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ఈ ప్రాజెక్టుపై అధికారులతో ఏరియల్‌ సర్వే చేయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రానుండడంతో వడగామ్‌ ప్రాజెక్టు మంజూరు చేస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు.

అధికారంలో రాగానే వస్తానని..

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ ఉన్న సమయంలో 2021 ఏప్రిల్‌ 20న హీరాపూర్‌ గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో భోజనం చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మరోసారి హీరాపూర్‌ గ్రామానికి వస్తానని వారికి మాటిచ్చారు. ఆ ప్రకారం ఏప్రిల్‌ 6న జిల్లా పర్యటనలో భాగంగా పిప్పిరి గ్రామంలో పర్యటించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌, మాజీ ఎంపీ సోయం బాపురావ్‌, కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా అధికారులను పిలిచి..తాను మే నెలలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడి సమస్యలపై గ్రామస్తులతో చర్చించి తనకు నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఖానాపూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ.. హీరాపూర్‌లో ఆదివాసీలతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఐటీడీఏ పీవోతో హాజరై ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 6న టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ ఈ గ్రామాన్ని సందర్శించి సోలార్‌ విద్యుత్‌ సరఫరాపై అధికారులతో చర్చించారు. ఐటీడీఏ ద్వారా రైతుల చేలల్లో వందశాతం సోలార్‌ పంపు సెట్లు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హీరాపూర్‌ ఆవాస ఏడు గ్రామాల్లో రూపురేఖలు మారనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement