బెల్లంపల్లి: పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్, బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్ సోమవారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల వివరాలు
బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బజారు ఏరియా బ్రాంచ్ హైస్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,171 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 619 మంది బాలురు, 552 మంది బాలికలు ఉన్నారు. మంచిర్యాలలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాయికుంట), జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గర్మిళ్ల), శ్రీ చైతన్య హైస్కూల్, అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ కేంద్రాల్లో 2,364 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 1,257 మంది, బాలికలు 1,107 మంది ఉన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల (బెండారా)ఆసిఫాబాద్, మాతృశ్రీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,064 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.


