ప్రేమ పేరిటే అధికం
నిర్మల్: బడికి వెళ్లాల్సిన బాలిక పెళ్లి పీటలెక్కుతోంది. పట్టుమని పదిహేనేళ్లు
కూడా నిండని వయస్సులో ఆలిగా, తల్లిగా బాధ్యతలు మోస్తోంది. సంసారం అంటే తెలియని వయస్సులోనే కష్టాల కాపురం చేస్తోంది. ఇలాంటి బాలికా వధువులను కాపాడటానికి, బాల్యవివాహాలను అడ్డుకో వడానికి జిల్లా అధి కార యంత్రాంగం శా యశక్తులా ప్రయత్ని స్తోంది. అయినా.. ఇ ప్పటికీ జిల్లాలో బాల్య వివాహాలు కొనసాగుతుండటం కలవరానికి గురి చేస్తోంది.
కారణాలనేకం..
పేదరికం, నిరక్షరాస్యత, అవగాహనలోపం, ఆడపిల్లలు ఎక్కువగా ఉండి భారం దించుకోవాలని తల్లిదండ్రులు భావించడం ఇలాంటివన్నీ మైనర్‌ల పెళ్లిళ్లకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రేమ వివాహాలపై మోజుతోనూ ఇటీవల చాలామంది బాల,బాలికలు తప్పుదారి పడుతున్నారు. మరోవైపు తమ పిల్లలు ప్రేమవివాహాలు చేసుకోవద్దన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు విషయం తెలియగానే వారి వయస్సు గురించి ఆలోచించకుండా ఇతరులతో పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ప్రస్తుతం జి ల్లాలో ఇలాంటి బాల్యవివాహాలే ఎక్కువగా జరుగు తుండడం గమనార్హం.
అందరిపైనా కేసులు.. రెండేళ్ల జైలు
బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చట్టాలు చెబుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కఠిన నిబంధనలున్నాయి. 18ఏళ్లు నిండని బాలిక, లేదంటే 21 ఏళ్లు నిండక ముందే యువకుడు పెళ్లి చేసుకోవడానికి వీలులేదు. ఇలాంటి వివాహాలు జీవో ఎంఎస్ 13.2012 ప్రకారం నేరం. చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలు చేస్తే బాధ్యులైన వారికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా, ప్రత్యేక సందర్భాల్లో ఈ రెండింటినీ ఒకేసారి విధించే అవకాశముంది. ఇక బాల్యవివాహం జరిపినా, నిర్వహణలో భాగమైనా, చివరకు ప్రోత్సహించినా శిక్ష విధించే వీలుంది. దీనిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. బాల్యవివాహాలు చేసే ఫంక్షన్‌హాళ్లు, మతపెద్దలు, చివరకు క్యాటరింగ్ చేసేవారిపైనా కేసులు పెట్టే అవకాశముంది.
తెలిస్తే 1098కు ఫిర్యాదు చేయొచ్చు
బాల్యవివాహాలను అడ్డుకునేందుకు గ్రామాలు, ప ట్టణాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానికంగా జరిగే వివాహాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఈ కమిటీల్లో గ్రామాల్లో సర్పంచ్, ప ట్టణాల్లో కౌన్సిలర్, అంగన్‌వాడీ టీచర్, ఆశ కార్యక ర్త, పోలీస్, ఏఎన్‌ఎం సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే వారు ఉన్నతాధికారులకు తెలిపి వారి ద్వారా అవగాహన కల్పించి అడ్డుకుంటున్నారు. ఇక ఎవరైనా, ఎక్కడైనా మైనర్లకు వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే.. 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టప్రకారం నేరం. మైనర్లకు పెళ్లి చేస్తే వారి ఆరోగ్యంతోపాటు జీవితంపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇలాంటివి సమాజంలో ప్రతిఒక్కరూ అడ్డుకోవాలి.
– వినూత్న, జిల్లా సంక్షేమాధికారి
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. సమాచారం అందిన వెంటనే వెళ్లి మైనర్ల పెళ్లిళ్లను నిలిపివేస్తున్నాం. వారితో ఒప్పంద పత్రాన్నీ రాయిస్తున్నాం. చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేయిస్తున్నాం.
– మురళి, జిల్లా బాలల సంక్షేమాధికారి
సమన్వయంతో అడ్డుకట్ట
జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరించి 2025లో 12, 2026లో ఇప్పటివరకు 9 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వీటిలో కొన్ని కేసులు నమోదు కాగా.. మరికొన్ని విచారణలో ఉన్నాయి. ముందస్తుగా ప్రత్యేక దృష్టి సారించడం, సమర్థంగా సక్రమమైన సమాచారం సేకరించడం, ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించడం తదితర ప్రధాన అంశాలతోపాటు యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతోనే బాల్యవివాహాల నిలిపివేత సాధ్యమవుతోందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
బాల్య వివాహాల్లో తల్లిదండ్రుల తప్పిదాలు ప్రధాన కారణమై తే.. ఇటీవల ప్రేమ అనే ఆకర్షణకు లోనవుతూ తమంతట తామే చాలామంది మైనర్లు అనర్థాలు కొనితెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులను ఏమార్చి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఆ తర్వాత తప్పిదాలు తెలుసుకుంటున్నా.. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. జిల్లాలోని ఓ గ్రామంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులను కాదని తాను ఇష్టపడ్డ వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుంది. పరీక్షలూ పాసైంది. కానీ, ఆమె పైచదువు కొనసాగించడానికి భర్త అడ్డుచెప్పాడు. దీంతో చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇలా తెలిసీతెలియని వయస్సులో పలువురు మైనర్లు నిండు జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.


