లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యావారోత్సవాలు నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 11నుంచి 17వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, ఉ న్నతాధికారుల సూచన మేరకు ఇప్పటికే అన్ని మండలాల మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు కార్యక్రమాల నిర్వహణపై సూచనలు చేసినట్లు జిల్లా విద్యాధికారి భోజన్న తెలిపారు. సమన్వయంతో జిల్లాలో విద్యావారోత్సవాలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమాల వివరాలు
ఈ నెల 11న పీఎం శ్రీపాఠశాలలు, కేజీబీవీల్లో వేస వి శిబిరాలు ప్రారంభించాలి. ఇప్పటివరకు మంజూరైన నిధులతో పనులు ప్రారంభించాలి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, యువతను భాగస్వాములను చేయాలి. ఈ నెల 12న పదోతరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం శిబిరాలు నిర్వహించి అనుబంధ పరీక్షలు ప్రారంభమయ్యేదాకా తరగతులు కొనసాగించాలి. ఈ నెల 13న గ్రామ ప్రజాప్రతినిధులతో జి ల్లా స్థాయిలో కార్యశాల నిర్వహించాలి. విద్యా కార్య క్రమాలపై చర్చించాలి. ఈ నెల 14న ఆచార్య జయశంకర్ బడిబాటలో భాగంగా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 15న విద్యాలయాల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించి, ప్రతీ పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలి. ఈ నెల 16న ఆర్ట్ అండ్ క్రాప్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నెల 17న జవహర్ బాలభవన్ దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.


