ఆదిలాబాద్: ప్రేమకు దూరంతో పనిలేదు. ఎన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నా మనసులు కలిస్తే చాలు మనుషులు జంటవుతారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడి వివాహం లండన్ నగరానికి చెందిన యువతితో జరగడం ప్రేమకు హద్దులు లేవన్న విషయాన్ని చాటింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయిచరణ్, ఇంగ్లాండ్ రాజధాని లండన్ నగరానికి చెందిన మియా మే అనే యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అక్కడ వీరి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం ఇంట్లో పెద్దలను వారి పెళ్లికి ఒప్పించారు. ఆదివారం ఆదిలాబాద్‌లోనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. విదేశీ యువతి అయినా మియా మే తెలుగు సంప్రదాయంపై ఎంతో ఆసక్తితో చీర ధరించింది. ఈ వినూత్న ప్రేమ వివాహం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్శించింది. ఖండాంతరాలు దాటిన ఈ జంట బంధాన్ని చూసి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించారు.


