మందకొడిగా మక్కల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా మక్కల కొనుగోళ్లు

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

● కేంద్రాలకు రాని లారీలు.. ● కేంద్రాల్లో పేరుకుపోతున్న రాశులు ● రోజుల తరబడి రైతుల పడిగాపులు

బస్తాల తరలింపులో జాప్యం

లోకేశ్వరం : ఆరుగాలాల శ్రమతో పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భైంసా డివిజన్‌లో ఈ సీజన్‌లో తూకం వేసిన ధాన్యం వారం నుంచి పది రోజులపాటు కేంద్రాల్లోనే ఉండిపోతోంది. లారీలు రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

1.25 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లాలో ఈ యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అకాలవర్షాల వల్ల 40 శాతం మంది రైతులు మద్దతు ధర కంటే రూ.600 తక్కువగా ప్రైవేటు వ్యాపారులకు అమ్మారు. మిగిలిన 60 శాతం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 24 కేంద్రాలకు మక్కలు తరలించారు.

కొనుగోళ్లు ఆలస్యం

24 కేంద్రాల్లో ఇప్పటివరకు కేవలం 5 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. లారీలు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలు కుప్పలుగా పడిపోతున్నాయి. అకాల వర్షాలకు మక్కలు తడిసిపోతే ఎండబెట్టి మార్పిడి చేయాల్సి వస్తోంది. గన్నీ బ్యాగుల కొరతతో రైతులు గన్నీ సంచులు కొనుగోలు చేస్తున్నారు.

లారీలు పంపిస్తాం

గోదాముల్లో అన్‌లోడింగ్‌ కొంత ఆలస్యమవుతోంది.మక్కలు,ధాన్యం ఒకే సారి రావడంతో లారీల సమస్య ఏర్పడుతోంది.లారీల సంఖ్యను పెంచి సమస్యను పరిష్కరిస్తున్నాం.రెండు రోజుల్లో తూకం వేసిన బస్తాలను తరలిస్తాం.

– మహేశ్‌కుమార్‌, డీఏం, నిర్మల్‌ మార్క్‌ఫెడ్‌

Advertisement
 
Advertisement
Advertisement