స్వీయ జనగణనకు స్పందన కార్యక్రమంపై విస్తృత ప్రచారం ఇప్పటి వరకు 12,897 కుటుంబాలు పూర్తి రేపటితో ముగియనున్న ప్రక్రియ
నిర్మల్‌చైన్‌గేట్:ప్రభుత్వం చేపట్టిన స్వీయగణన కార్యక్రమం సమయాన్ని కుదించి, కచ్చితమైన జ నాభా సమాచారాన్ని సేకరించడంలో విజయవంతమవుతోంది. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన విస్తృత ప్రచారంతో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జనాభా గణన అవసరం
2011 లెక్కల ప్రకారం జిల్లాలో 7,09,418 మంది, 1,65,763 గృహాలు ఉన్నాయి. 2021 గణన కోవిడ్ కారణంగా ఆలస్యమై, 2026లో ప్రక్రియ ప్రారంభమైంది. అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఈ డేటా మూలస్తంభంగా ఉంటుంది. ఈమేరకు జిల్లాలో 26 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.
స్వీయగణనకు స్పందన
గత నెల 26 నుంచి మొదలైన స్వీయ గణన కార్యక్రమం ఈ నెల 10 వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖుల ఇంటి వెళ్లి స్వయంగా గణన చేయించుతున్నారు. 33 అంశాలతో మొబైల్ యాప్‌లో ప్రాథమిక వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 12,897 కుటుంబాలు పాల్గొన్నాయి.
2027లో ఫలితాలు..
స్వీయగణన ఇంటింటి సర్వే పూర్తి అయిన తర్వాత 2027 ఫిబ్రవరి, మార్చిలో జనగణన చేపడుతారు. ఆ ఏడాది మే నెలలో జనాభా లెక్క తేలుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తుంది. దీనిపైనే పథకాల అమలు, ఇతర అన్ని ఆధారపడి ఉంటాయి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేయనున్నారు.
ఈనెల 11 నుంచి
ఇంటింటి సర్వే..
ఎన్యుమరేటర్లు ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో ఇంటి నంబర్లు వేసుకుంటారు. ఈ సర్వేలో కేవలం కుటుంబ యాజమాని పేరు, ఇల్లు, మరుగుదొడ్డి ఇతర వివరాలతో 33 కాలమ్‌లు ఉంటాయి. ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. ఇళ్ల సర్వే మాత్రమే పూర్తి చేయనున్నారు.
జిల్లా వివరాలు:
2027 జిల్లా జనాభా సుమారు 8,20,000
గృహాలు 2,05,000
మాస్టర్ ట్రైనర్ 01
ఫీల్డ్ ట్రైనర్లు 26
ఎన్యుమరేటర్లు 1,337
సూపర్‌వైజర్లు 230


