నిర్మల్‌చైన్‌గేట్: దేశ ప్రగతి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జనగణన ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ మారథాన్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక చేపడుతుందన్నారు. జనగణన–2027లో భాగంగా ప్రతీపౌరుడు ‘‘స్వీయ గణన’’ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీ కుటుంబం తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవాలని, అవగాహన లేని వారికి ఇతరులు సహకరించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఈవో భోజన్న, ఎల్‌డీఎం రామ్‌గోపాల్, డీపీవో శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ పీజీ.రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


