అకాల వర్షాలతో పెరిగిన కష్టాలు తడిసిన వరి ధాన్యం, మక్కలు తరోడా వద్ద బారులు తీరిన లారీలు గోదాముల్లో ఖాళీ లేక నిలిచిన లోడింగ్
భైంసా: జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నిన్నటి వరకు అగ్నిప్రమాదాలతో మొక్కజొన్న, జొన్న చేలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోయింది. ఇక తాజాగా వరుణుడు పగబట్టాడు. అకాల వర్షాలతో అన్నదాత మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోదాముల వద్ద మొక్కజొన్న, వరి ధాన్యం భారీగా పేరుకుపోయాయి. ఈ సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను మరింత నష్టపరుస్తున్నాయి.
ఈదురుగాలులు.. వర్షం
గురువారం మధ్యాహ్నం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. రైతులకు కన్నీళ్లు తెప్పించింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆరబెట్టిన వరి ధాన్యం, మొక్కజొన్న కుప్పలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
వేగవంతం చేస్తేనే...
జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరిధాన్యం పంటలు ఒకేసారి వచ్చాయి. ఈ సమయంలో గోదాముల్లో నిల్వసామర్థ్యం తక్కువగా ఉండడం, కొనుగోలు ప్రక్రియ వేగవంతం లేకపోవడం రైతులను ఇబ్బందులపాలుచేస్తుంది. కల్లాలపై ఉన్న మొక్కజొన్న తరలించేందుకు రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. గత పది రోజులుగా చేతికి వచ్చిన పంటను విక్రయించుకునేందుకు జిల్లా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించి రైతుల ఇబ్బందులను తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్క్‌ఫెడ్, సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. రైతులు నష్టపోకముందే ప్రభుత్వం స్పందించాలని విన్నవిస్తున్నారు.
16 రోజులైంది
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట కోసి కల్లం మీదకు తీసుకువచ్చి 16 రోజులైంది. కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి. గు రువారం వర్షం కురవడంతో కుటుంబమంతా కల్లం దగ్గరికే వెళ్లాం. ఇంట్లో ఉన్న టర్పాలిన్లు కప్పి వర్షంలో తడవకుండా పంటను కాపాడుకున్నాం. ప్రభుత్వం కల్లాల వద్ద టా ర్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచాలి. – ఖలీలుద్దీన్, రైతు ముధోల్


