గుండేగాం గోస తీరేదెప్పుడో..!
పునరావాసం కోసం ఎదురుచూపులు
ఏటా వానాకాలం ముంపు తిప్పలు..
భైంసారూరల్: భైంసా మండలం గుండేగాం గ్రామస్తులు ప్రతీ వర్షాకాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి. పల్సికర్ రంగారావు ప్రా జెక్టు నిర్మాణంతో గ్రామం కొన్నేళ్లుగా వర్షాకాలంలో బ్యాక్ వాటర్ ముంపు ముప్పు ఎదుర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులు ఊరిలో కి నీళ్లు రావని హామీ ఇచ్చినా.. తొమ్మిదేళ్లుగా వర్షాకాలంలో గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది.
పునరావాసం ఉత్తమాటే..
గ్రామం నీటమునిగిన ప్రతిసారీ ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి పునరావాసం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే అనేక ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని నేలమట్టమయ్యాయి. కమలాపూర్ గుట్ట వద్ద కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో చాలామంది ఇప్పటికే పట్టణాలకు వలస వెళ్లారు. వ్యవసాయంపై ఆధారపడిన కొన్ని కుటుంబాలు మాత్రం దిక్కులేక బిక్కుబిక్కుమంటూ అక్కడే నివసిస్తున్నాయి.
వానాకాలమొస్తే టెన్షన్..
ప్రస్తుతం తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో, కమలాపూర్ గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో గుండేగాం వాసులు తలదాచుకుంటున్నారు. 131 కుటుంబాలతోపాటు మిగిలిన గ్రామస్తులు శాశ్వత పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో, మళ్లీ పాత కథ పునరావృతమవుతుందన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. వేసవికాలం ముగిసేలోపు ప్రభుత్వం స్పందించి, పునరావాసం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
గుండేగాం గ్రామ ప్రజల కష్టం ఎప్పటికి తీరుతుందో అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండగా గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రతి ఏడాది వానాకాలం వస్తుందంటే గుండేగాం ప్రజలకు భయం మొదలవుతుంది. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది.
నాయకుల సందర్శనలు..
గతంలో మంత్రులు జోగు రామన్న, అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. అప్పటి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినప్పటికీ పునరావాసం అమలు కాలేదు.
తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే...
తొమ్మిదేళ్లుగా వర్షాకాలంలో బాధితులకు రెవెన్యూ అధికారులు పట్టణంలో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ప్రస్తుతం కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో 131 కుటుంబాలు తాత్కాలికంగా నివసిస్తున్నాయి. మిగతా కుటుంబాలు కూడా ఎప్పటికై నా శాశ్వత నివాసం లభిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నాయి.
వేసవి దాటితే మళ్లీ అదే కథ...
ప్రస్తుతం వేసవికాలం కావడంతో పునరావాస చర్యలు చేపట్టేందుకువీలుంది. లేని పక్షంలో జూన్‌లో మొదలయ్యే వానలకు మళ్లీ గ్రామం నీటమునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గుండేగాం గ్రామానికి శాశ్వత పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
ప్రభుత్వం వద్ద పెండింగ్..
గుండేగాంకు పునరావాసంకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. అక్కడ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక తదుపరి చర్యలు చేపడుతాం.
– అనిల్, డీఈఈ ఇరిగేషన్
గుండేగాం గ్రామం
గ్రామానికి రంగారావు ప్రాజెక్టు
ముంపు ముప్పు
ప్రధాన సమస్య ఇదే...
పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో తొమ్మిదేళ్లుగా ప్రతి వర్షాకాలంలో బ్యాక్‌వాటర్ గ్రామంలోకి చేరుతోంది. భారీ వర్షాలు కురిస్తే ఇళ్లు పూర్తిగా నీటమునుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గ్రామస్తులు తమ ఊరిలోకి నీళ్లు వస్తాయని అధికారులకు చెప్పగా వారు ఊరిలోకి నీళ్లు రావని హామీ ఇచ్చారు. ముందుచూపు లేక అధికారులు వేసిన అంచనాలు, ప్రణాళికలో డొల్లాతనాన్ని బ్యాక్ వాటర్ బహిర్గతం చేస్తోంది.
గ్రామ వివరాలు:
గ్రామం : గుండేగాం
కుటుంబాలు : 162
రేషన్ కార్డులు : 236
జనాభా : 694
పునరావాసం మాటల్లోనే...
గుండేగాంలోకి నీరు ప్రవేశించిన ప్రతి సారి ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామానికి చేరుకుని బాధితులకు పునరావాసం కల్పిస్తామని హామి ఇస్తున్నారు. కానీ అమలులో చూపడం లేదు. దీంతో ప్రతి వర్షాకాలం ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. పునరావాసం కల్పిస్తామని ఏళ్లు గడుస్తున్న ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితుల ఇండ్లన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని నేలమట్టమయ్యాయి. దీంతో నిల్వ నీడలేక ఎంతో మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వ్యవసాయ ఆధారంపై కాలం వెళ్లదీస్తున్న కొన్ని కుటుంబాలు బిక్కుబిక్కుంటు అక్కడే ఉంటున్నారు. భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్ట వద్ద కొత్త గ్రామం ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా గుండేగాం ప్రజల పరిస్థితి మాత్రం మారలేదు.


