ఎర్లీబర్డ్‌.. అంతంతే! | - | Sakshi
Sakshi News home page

ఎర్లీబర్డ్‌.. అంతంతే!

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

● ముందస్తు చెల్లింపునకు వెనుకడుగు ● మూడు మున్సిపాలిటీల్లో వసూలైంది రూ.2.91 కోట్లే! ● నిర్మల్‌ ఫస్ట్‌.. భైంసా లాస్ట్‌

భైంసాటౌన్‌: పట్టణాల్లో ఆస్తిపన్నుల ముందస్తు వసూలు కోసం పురపాలక శాఖ చేపట్టిన ఎర్లీబర్డ్‌ స్కీంకు జిల్లాలో అంతంత మాత్రంగానే స్పందన లభించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందుగా చెల్లించినవారికి అంటే ఏప్రిల్‌ 30 వరకు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ అవకాశం కల్పించింది. అయితే జిల్లాలోని ఆయా బల్దియాల్లో 10–15 శాతం ప్రజలు మాత్రమే ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించారు. తాజాగా ఈనెల 7 వరక గడువు పొడిగించినట్లు పురపాలక అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో వసూలు ఇలా..

ఎర్లీబర్డ్‌లో భాగంగా జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీల్లో 5 శాతం రాయితీపై ఆస్తిపన్ను వసూలు పరిశీలిస్తే.. నిర్మల్‌లో రూ.2.01 కోట్లు(15శాతం), భైంసాలో రూ.55 లక్షలు(8.16శాతం), ఖానాపూర్‌లో రూ.35.10 లక్షలు (12.60శాతం) వసూలయ్యాయి. ఈ లెక్కన నిర్మల్‌ మున్సిపాలిటీలో ప్రజలు ఈ అవకాశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. భైంసా చివరిస్థానంలో ఉంది.

అవగాహన లేక..

ఎర్లీబర్డ్‌ స్కీంకు సంబంధించి మున్సిపల్‌ అధికారులు అంతగా ప్రచారం చేపట్టలేదు. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తేప్రయోజనం ఉంటుంది. అయితే, అధికారులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారు. దీంతో పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసినవారు, ఈ స్కీం గురించి తెలిసినవారు మాత్రమే ముందస్తుగా చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారు ఈ స్కీంకు అర్హులు కారు.

సద్వినియోగం చేసుకోవాలి..

ఆస్తిపన్ను ముందుగా చెల్లించేవారిని ప్రోత్సహించేందుకు పురపాలక శాఖ ఏటా ఎర్లీబర్డ్‌ పథకం చేపడుతోంది. ఇందులో భాగంగా ఈసారి (2026–27 ఆర్థిక సంవత్సరం)సైతం ఆస్తి పన్నును ఏప్రిల్‌ 30 వరకు చెల్లించినవారికి 5 శాతం రాయితీ అవకాశం కల్పించాం. చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. ఈనెల 7వ తేదీ వరకు గడువు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– లింగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌, భైంసా

Advertisement
 
Advertisement
Advertisement