● ఆయకట్టు రైతులకు తప్పని తిప్పలు
కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు కడెం. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు. అయితే ఇందులో పేరుకుపోయిన పూడిక, రైతుల పాలిట శాపంగా మారింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం సగానికి తగ్గిపోయింది. దీంతో పూడిక తొలగించి సాగునీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2024లోనే రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లు కావొస్తున్నా కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు. ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినా, క్షేత్రస్థాయిలో పురోగతి లేకపోవడంతో పూడికతీతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..
పూడికతీత పనులను దక్కించుకున్న రాజస్థాన్‌కు చెందిన ’ఈథర్’ కంపెనీ, హైడ్రాలజీ సర్వే నిర్వహించినా పనులను ప్రారంభించలేదు. డంపింగ్ యార్డ్ కోసం భూమి గుర్తింపులో జాప్యం, అగ్రిమెంట్‌లో లోపాలు తదితర కారణాలతో సదరు సంస్థ వెనకడుగు వేస్తోందని సమాచారం. దీనిపై ఇరిగేషన్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. తాజాగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపి, ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేసి, కొత్త వారికి పనులు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
యాసంగిలో ఆయకట్టుకు నీటి ఎద్దడి..
కడెం ప్రాజెక్టుపై ఆరు మండలాల పరిధిలోని సుమారు 68,150 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రాజెక్టులో పూడిక పెరిగి నీటి నిల్వ తగ్గడం వల్ల యాసంగిలో పంటలకు సరిపడా నీరు అందడం లేదు. సాగు 25 వేల ఎకరాలకు తగ్గిపోయింది. ఈ పంటలకు కూడా వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నా, అది రైతులకు ఏమాత్రం సరిపోక పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపడితేనే, వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.
నోటీసులు ఇచ్చాం..
కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులు ప్రారంభించని కాంట్రాక్ట్ కంపనీకి పలుమార్లు నోటీసులు జారీ చేశాం. పూడితకతీత కోసం హైడ్రాలజీ సర్వే నిర్వహించిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఈ విషయం ఇటీవలే ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.
– ప్రవీణ్, ఈఈ కడెం ప్రాజెక్టు
పూడికతో నిండిన కడెం ప్రాజెక్ట్
4 టీఎంసీల పూడిక..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. అందులో సగానికి పైగా పూడిక పేరుకుపోయినట్లు అంచనా. 2013 నాటి సర్వే ప్రకారం సుమారు 2.7 టీఎంసీల మేర పూడిక ఉందని గుర్తించగా, ప్రస్తుతం అది 4 టీఎంసీలకు చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో వరదతోపాటు వచ్చే మట్టి, ఇసుక బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు గర్భం నిండుతోంది. నిర్మాణం నాటి సిల్ట్ గేట్లు నిర్వహణ లేక పేరుకుపోయింది. నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోంది.


