ఖానాపూర్: పట్టణంలోని కుమురంభీమ్ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, అనర్హులను తొలగించి అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్ భవేశ్ మిశ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, డబుల్ బెడ్‌రూమ్ సాధన కమిటీ కన్వీనర్ తోట రాధ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో గతంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈవిషయమై ఆందోళనలు చేసినా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 400 ఇళ్లపై పూర్తి స్థాయిలో రీసర్వే నిర్వహించి, లబ్ధిదారుల నుంచి సెల్ఫ్ అఫిడవిట్‌లు తీసుకుని అర్హులను గుర్తించాలని సూచించారు. సమగ్ర విచారణతో వాస్తవాలు బయటపడతాయన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారంలో ఆలస్యం కొనసాగితే అర్హులతో కలిసి ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటవార్పులు చేస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జరీనా, లక్ష్మి, లావణ్య, రుక్మా, మజీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


