భైంసాటౌన్: పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించారు. సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భైంసా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 10 వినతులు రాగా, పరిశీలన కోసం సంబంధిత అధికారులకు ప్రతిపాదించారు. అన్ని ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేస్తామని, ఫిర్యాదుల పరిష్కారానికి 30 రోజుల గడువు ఉంటుందన్నారు.
● పాంగ్ర గ్రామ పంచాయతీలోని బాకోట్ గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బంది ఏర్పడుతోందని గ్రామస్తులు పలువురు విన్నవించారు.
● తన తండ్రి మరణానంతరం ఆయన పేరుపై ఉన్న 0.21 గుంటల భూమిని తనపేరు మీద విరాసత్ చేయాలని భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన సిద్దార్థ్ వినతిపత్రం అందజేశారు.
● విద్యుదాఘాతంతో పంట నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించాలని కుంటాల మండలం పెంచికల్‌పాడ్ గ్రామానికి చెందిన జాదవ్ అరుణబాయి కోరారు.
● పెంచికల్‌పాడ్ నుంచి అందకూరు మార్గంలో ఏడాది కిందట రోడ్డు వేశారని, అయితే, గ్రామంలోని వాగుపై ఉన్న వంతెన పక్కన రెండువైపులా బీటీ వేయకపోవడంతో కంకర తేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గ్రామానికి చెందిన కిష్టయ్య కోరారు.


