భైంసా: జ్ఞాన సరస్వతీ అమ్మవారి నిలయమైన బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను నెలకొల్పేందుకు గతేడాది మే నెలలో కేంద్రీయ విద్యాలయ దక్షిణాది విభాగం అధికారులు బాసరకు వచ్చి అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాసర ట్రిపుల్‌ఐటీ సమీపంలో గోదావరి నది మార్గంలో ఉన్న పలు ప్రాంతాలను వారు తనిఖీ చేశారు. తాత్కాలిక భవనాలను సైతం పరిశీలించారు. బాసర ట్రిపుల్‌ఐటీ సమీపంలో ఒక భవనం, గోదావరి నదికి వెళ్లే దారిలో మరో భవనాన్ని పరిశీలించారు. విద్యార్థుల వసతి, రవాణా సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేయడంపై చర్చలు జరిపారు.
స్థలం కేటాయింపు..
రెవెన్యూ అధికారులు బాసరలోని సర్వే నంబర్ 4లో ఉన్న సుమారు 28 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుండగా, అదే ప్రాంగణంలో శాశ్వత భవనాన్ని నిర్మించాలని జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రతిపాదనలు అందడంతో, తుది అనుమతుల కోసం ఫైల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలనలో ఉంది. దేశవ్యాప్తంగా మంజూరైన 47 కేంద్రీయ విద్యాలయాల జాబితాలో భాగంగా, బాసరలో కూడా ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య..
బాసరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైతే గ్రామీణ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే కాకుండా, స్థానిక విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యాబోధన లభించనుంది. దీనివల్ల బాసర ప్రాంతం ఒక విద్యా కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్సెస్సీ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన పునాదిని ప్రాథమిక స్థాయి నుంచే నిర్మించుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఒకే రకమైన పాఠ్యప్రణాళిక అమలు కావడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
కొత్త విద్యా విధానం, డిజిటల్ విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, మారుమూల ప్రాంతాల్లోనూ విద్యా సదుపాయాలను విస్తరిస్తోంది. స్థానికంగా కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రావడం వల్ల, ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. సరస్వతీ క్షేత్రమైన బాసరకు ఈ సంస్థ రాకతో, స్థానిక మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయంగా ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.
కేంద్రం కరుణిస్తేనే ... కేంద్రీయ విద్యాలయం...


