రైతు వారం.. సాగుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

రైతు వారం.. సాగుకు సన్నద్ధం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

● నేటి నుంచి ఈనెల 9 వరకు నిర్వహణ ● వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించేందుకు ’రైతు వారోత్సవాలు’ నిర్వహిస్తోంది. మే 4 నుంచి 9 వరకు జరిగే ఈ కార్యక్రమం ఖరీఫ్‌ పంటల సాగు, నేల ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జిల్లాలోని 79 క్లస్టర్లలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.

వానాకాలం సాగుపై అవగాహన..

రైతు వారంలో భాగంగా ఖరీఫ్‌ పంటలపై దృష్టి పెట్టి, ఉద్యానవన, ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. కార్యక్రమం రైతుల చైతన్యాన్ని పెంచి, ఆదాయ విస్తరణకు మార్గం సుగమం చేస్తుంది. ఇందులో నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, సన్న వరి సాగులో ఆధునిక పద్ధతులు తెలియజేస్తారు. బ్యాంకు రుణాలు, పీఏసీఎస్‌, ఎఫ్‌పీవో సేవలు తెలియజేస్తారు. మార్కెటింగ్‌, సౌర యాంత్రీకరణ, డ్రోన్లు, పీఎం కుసుమ్‌ పథకంపై అవగాహన కల్పిస్తారు. గతంలో సేకరించిన మట్టి నమూనాల ఫలితాల కార్డులను రైతులకు అందచేసి వాటి ఆధారంగా పంటల సాగులో ఎరువుల వినియోగంపై సూచనలు చేస్తారు.

మట్టి పరీక్షలు

మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 25 వరకు ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలు చొప్పున 4 వేల నమూనాలు సేకరించారు. ఫలితాల కార్డులు రైతులకు అందజేసి, ఎరువుల వాడకాన్ని మార్చుతారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ ఎరువుల వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటారు. మత్స్యశాఖ ఆద్వర్యంలో చెరువుల్లో కలుపు మొక్కల తొలగింపు, చేపలు, పశువుల వ్యాధుల నియంత్రణపై సూచనలు చేస్తారు.

రైతులను సన్నద్ధం చేస్తాం..

రానున్న ఖరీఫ్‌ సాగుకు అన్నదాతను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నాం.ఇందులో భాగంగా వారం రోజులు రైతు వారోత్సవాలను నిర్వహిస్తాం. ముఖ్యంగా మట్టి నమూనాలు తీసుకునే పద్ధతి, వాటి ఫలితాల ఆధారంగా వివిధ పంటల సాగు వంటి అంశాలపై రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – అంజిప్రసాద్‌, డీఏవో, నిర్మల్‌

జిల్లా సమాచారం...

మొత్తం జీపీలు 400

వ్యవసాయ క్లస్టర్లు 79

గతంలో సేకరించిన మట్టి నమూనాలు 6 వేలు

ఈ సారి సేకరించిన మట్టి నమూనాలు 4 వేలు

Advertisement
 
Advertisement
Advertisement