భైంసాటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పి రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలో శనివా రం నియోజకవర్గస్థాయి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం వివిధ పథకాల కింద నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, బాసర ఆలయ అభివృద్ధి, సమీకృత పాఠశాల మంజూరు, అభివృద్ధి పనులకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పట్టణాలు, పల్లెల్లో విచ్చలవిడి జరుగుతున్న గంజాయి విక్రయాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్‌తో పంటలు దగ్ధం కావడంపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ చేతులమీదుగా మహిళా సంఘాలకు రూ.9 కోట్ల రుణాల చెక్కు అందించారు. తర్వాత శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావ్‌పటేల్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


