నిర్మల్‌చైన్‌గేట్: పేదల ఉన్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు తదితర అన్ని అంశాల్లో పేదల ఉన్నతికి పాటుపడుతోందని తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త పథకాలు ప్రారంభిస్తుందన్నారు. వచ్చే వారం నుంచి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ సందర్శించారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


