నేడు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

● భైంసాలో పోటీ ఆసక్తికరం ● కాంగ్రెస్‌కు కౌన్సిలర్‌ రాజీనామా ● మారనున్న రాజకీయ సమీకరణలు

భైంసాటౌన్‌: జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలు ఉండగా, నిర్మల్‌, భైంసాలో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భైంసాలో గురువారం, నిర్మల్‌లో మే 2న ఎన్నిక నిర్వహించనున్నారు. రెండు బల్దియాల్లో నలుగురు చొప్పున కో ఆప్షన్‌ సభ్యులకు పాలకవర్గంలో చోటు దక్కనుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం బరిలో ఉన్న ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు చోట్ల పోటీ ఉన్న దృష్ట్యా మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతిస్తే వారికే పదవులు దక్కనున్నాయి.

భైంసాలో పోటీ తీవ్రం

భైంసా మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ పదవుల కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మొత్తం 26 దరఖాస్తులు రాగా, 10 తిరస్కరణ, ఉపసంహరణకు గురయ్యా యి. 16 మంది బరిలో ఉన్నారు. స్పెషల్‌ నాలెడ్జ్‌ పురుషుల విభాగంలో ఒకరి దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో అతడు తన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే బరిలో 17 మంది ఉంటారు. స్పెషల్‌ నాలెడ్జ్‌ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఏడుగురు బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే కో ఆప్షన్‌ పదవి దక్కనుంది. ఇక, మైనారిటీ పురుషుల విభాగంలో ఇద్దరు, మహిళల విభాగంలో నలుగురు పోటీ పడుతున్నారు. ఇక్కడి పాలకవర్గంలో మొత్తం 26మంది సభ్యులుండగా, స్థానిక ఎమ్మెల్యే ఓటు కూడా పరిగణనలోకి రానుంది. అయితే, ఇటీవల కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్‌ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బుధవారం ప్రకటించారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సమయంలో స్వతంత్రులకు మద్దతు ఇవ్వగా, ప్రస్తుతం కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో ఎవరికి మద్దతిస్తారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా ఎవరికి ఎక్కువ మంది సభ్యులు చేతులెత్తి మద్దతిస్తే వారికే కో ఆప్షన్‌ పదవి దక్కనుంది.

నిర్మల్‌ బరిలో 42 మంది..

నిర్మల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, ఇక్కడ 42 మంది కౌన్సిల్‌ సభ్యులున్నారు. ఇక, కో ఆప్షన్‌ పదవుల కోసం కూడా 42 మంది బరిలో ఉండడం గమనార్హం. జనరల్‌ పురుషుల విభాగంలో 11 మంది, మహిళలు ఏడుగురు బరిలో ఉండగా, మైనారిటీ పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో ఎనిమిది మంది పోటీలో ఉన్నారు. మే 2వ తేదీన ఎన్నిక జరగనుండగా, మెజారిటీ సభ్యుల మద్దతుతో కో ఆప్షన్‌ పదవులు దక్కనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement